కారుమంచి గ్రామంలో ఉచిత ఆసుపత్రికి భూమి పూజ
వైద్యరంగం సేవా రంగం గా ఉండాలి ..మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి
టంగుటూరు డిసెంబర్ 9 న్యూస్ మేట్ : టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో2.3 ఎకరాల విస్తీర్ణంలో పేద ప్రజల కోసం స్వర్గీయ మాలే వెంకట కృష్ణారెడ్డి జ్ఞాపకార్ధంగా ఉచిత చారిటి ఆసుపత్రికి గురువారం మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా 16 మెడికల్ కళాశాలను ప్రారంభిస్తూ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం చేయడానికి తగిన సిబ్బందిని నియమించి విశిష్ట కృషి చేస్తున్నారన్నారు.మాలే వెంకట కృష్ణారెడ్డి కారుమంచి అభివృద్ధి కోసం అవిరళ కృషి జరిపారని పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించి వందలాది విద్యార్థుల జీవితాలల్లో వెలుగులు నింపారన్నారు.వారి జ్ఞాపకార్ధం కారుమంచి గ్రామంలో సామాన్య ప్రజానీకానికి ఉచితంగా వైద్యం అందించడానికి కుమారుడు మాలే శ్రీనివాసరెడ్డి,కుమార్తె హేమలత,తమ్ముడు మాలే వెంకటరామిరెడ్డి ముందుకు రావటం అభినందనీయమన్నారు.ఈ ఆసుపత్రి నిర్మాణం సంవత్సరం లోపు పూర్తిచేసుకుని కారుమంచి గ్రామం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల ప్రజలు దాదాపు యాభై వేల మందికి ఉచితంగా వైద్యం అందించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.సమాజంలో దాతృత్వం గల ధనవంతులు ఇలాంటి ఉచిత చారిటీ ఆసుపత్రులను వివిధ గ్రామీణ ప్రాంతాలల్లో ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించగలమన్నారు.సేవారంగంలో ఉండాల్సిన వైద్య రంగం ధనార్జన కేంద్రాలుగా ఉండటం విచారకరమన్నారు.ప్రభుత్వ ఆస్పత్రులను,చారిటీ ఆస్పత్రులను బలోపేతం చేయడం ద్వారా వైద్య రంగంలో దోపిడీని నివారించగలమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు మేదరమెట్ల చంద్రశేఖర్ రెడ్డి,కారుమంచి గ్రామ మాజీ సర్పంచ్ ఆనం సత్యనారాయణరెడ్డి, కారుమంచి గ్రామ పెద్దలు చిట్టెల వెంకటరామిరెడ్డి,ఏక సిరి శ్రీను,కందుల రాజారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.