మహనీయుడి త్యాగాన్ని మరిచిపోయారా!

మహనీయుడి త్యాగాన్ని మరిచిపోయారా!15/12/20
ఉదయగిరి డిసెంబర్ 15 (న్యూస్ మేట్) : అలనాడు తమిళ రాష్ట్రం తో ముడిపడి ఉన్న తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న కాంక్షతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి తమ ప్రాణాలు పోగొట్టుకుని తెలుగు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ని మర్చిపోవడం విషాదకరం. మంగళవారం అమరజీవి వర్ధంతి సందర్భంగా ఉదయగిరి లోని ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఎన్నో ప్రజా సంఘాలు, ఎందరో సామాజిక కార్యకర్తలు సైతం అమరజీవి వర్ధంతిని విస్మరించటం బాధాకరం అని పలువురు అంటున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అమరజీవి చిత్రపటం ఉండనే ఉంది. కానీ జయంతి వర్ధంతి రోజుల్లో అయినా ఆయన చిత్రపటానికి బూజు దులిపి నివాళులు అర్పించ వలసిన బాధ్యత ప్రతి తెలుగు వాడి పై ఉంది. ప్రభుత్వ కార్యాలయాలను పక్కనపెడితే భావి భారత పౌరులను తీర్చిదిద్దే కర్మాగారాలు అయిన పాఠశాలలు, కళాశాలలు కూడా ఆయన వర్ధంతిని విస్మరించటం ఆందోళన కలిగించే విషయం గా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన త్యాగం విద్యార్థులకు తెలియాల్సి ఉంది, భవిష్యత్తులో దేశ ప్రయోజనాలు సాధించుకునే క్రమంలో నాటితరం త్యాగం నేటి తరానికి తెలియాల్సి ఉంది. కానీ ఉపాధ్యాయులు సైతం ఆ మహనీయుడి వర్ధంతిని మర్చిపోవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా పొట్టి శ్రీరాములు తమ వాడంటూ వైశ్యులు గా పుట్టినందుకు గర్వపడుతున్నా మంటూ ఆయన పేరు నెల్లూరు జిల్లాకు పెట్టాలని ఉద్యమాలు చేసి సాధించిన ఆర్య వైశ్య సంఘాలు కూడా అమరజీవి వర్ధంతి ని మర్చిపోవడం ఏమిటి? అనే ప్రశ్నలు స్థానికంగా ఉత్పన్నమవుతున్నాయి.. ఏది ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మహనీయుల త్యాగాలు కూడా మర్చిపోతున్న సమాజం తయారవుతుందని నేటి సంఘటన చెప్పకనే చెబుతుంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *