అనారోగ్యం తో ఉదయగిరి సీజనల్ వ్యాధులతో జనం బెంబేలు
ఉదయగిరి డిసెంబర్ 20 (న్యూస్ మేట్) : ఉదయగిరి ప్రాంతం అనారోగ్యం బారిన పడింది. సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా విజృంభించడంతో ఉదయగిరి తో పాటు పరిసర పల్లెల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసినప్పటికీ వర్షపు నీటి వల్ల కలుషితమైన తాగునీరు ప్రజలను అనారోగ్యాల బారిన పడేస్తుంది అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గ్రామాలకు గ్రామాలు జ్వర పీడితు లై ఉన్నారు. సచివాలయాల్లో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ వారికి తగిన అవగాహన లేకపోవడం, సరిపడా మందులు సచివాలయం పరిధిలో అందుబాటులో ఉండక పోవడం వంటి కారణాల రీత్యా మండల కేంద్రంలోని వైద్య శాలలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాల ఉదయగిరిలో ఉన్నప్పటికీ సరిపడా సిబ్బంది లేకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ఇదే అదనుగా భావించిన పలు ప్రైవేటు వైద్యశాలలు గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గర నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ ప్రాంతాలలో వైద్య సేవలు లేకపోవడం, జిల్లా కేంద్రానికి సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉండటం రోగులకు భారంగా మారింది. పనిచేసే చోట నివాసం ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ చుట్టపుచూపుగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. శానిటేషన్ కొరవడటం, శుభ్రత లోపించడం, దోమల ఉత్పత్తి ఈ విష జ్వరాలకు కారణమంటూ గ్రామీణ ప్రజలు అంటున్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలను అదుపులో ఉంచాలంటూ పలువురు కోరుతున్నారు.