భూముల రీ సర్వేతో రైతుకు మేలు
కందుకూరు డిశంబరు 22 న్యూస్ మేట్ : భూముల రీ సర్వేతో చిక్కుముడిలా ఉన్న దశాబ్దాల నాటి గ్రామాల్లోని సమస్యలన్ని పరిష్కారమవుతాయని జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్ ఆర్ బి అండ్ ఆర్) జె. వెంకట మురళి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత సంకల్పంతో చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని మంగళవారం ఆయన లాంఛనంగా జిల్లాలో ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన కందుకూరు మండలం కొండి కందుకూరు గ్రామములోని మూడు గ్రామాల కూడలిలో జేసీ వెంకట మురళి పూజలు నిర్వహించి హద్దు రాయి వేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ కెమెరా సాటిలైట్ ఆధారంగా సర్వే నిర్వహించనుండగా జెసి వెంకట మురళి సంబంధిత యంత్రాన్ని స్విచ్ ఆన్ చేశారు. మహాదేవపురం, కొండి కందుకూరు, కందుకూరు గ్రామాల కూడలిలో సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన బృందం సర్వేను మొదలుపెట్టారు.కార్స్ డ్రోన్ విధానంతో జిల్లాలో తొలివిడతగా 350 గ్రామాలలో రీ సర్వే చేపడుతున్నామని జెసి వెంకట మురళి తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన ఏడు ప్రాంతాలలో బేస్ స్టేషన్లను నిర్మించామని, వీటిని అనుసంధానిస్తూ 24 జి సి పి పాయింట్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొండి కందుకూరు గ్రామంలో 196 సర్వేనెంబర్ లు ఉండగా అందులోని 1477.36 ఎకరాలను సుమారు మూడు నెలలలో డ్రోన్ కెమెరా, రోవర్ యంత్రాలతో సర్వే నిర్వహిస్తామన్నారు. సర్వేలో మూడు బృందాలు పనిచేస్తాయని, వారికి స్థానిక మండల, గ్రామ సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు సహకరించాల్సి ఉందని ఆయన సూచించారు.డిజిటల్ సర్వే ద్వారా గ్రామాలలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని జేసీ వెంకట మురళి స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన గ్రామంలో ఎదురయ్యే సమస్యలు మిగిలిన గ్రామాలలో పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రీ సర్వే ఈ ప్రక్రియలో సరిహద్దులు రాళ్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు నిధులు విడుదల చేసిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో వంద సంవత్సరాల తర్వాత భూములన్నీ సమగ్రంగా సర్వే నిర్వహిస్తోందన్నారు. హద్దులు ఖచ్చితమైన కొలతలతో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. ఎల్ పి ఎం ద్వారా రైతుల భూములను గుర్తించి నూతన పుస్తకాలను అందజేస్తామని ఆయన వివరించారు. సచివాలయాల వ్యవస్థ రూపొందించడం ద్వారా భూముల క్రయ, విక్రయాలకు, దస్త్రాల నిర్వహణ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, రీ సర్వే నోడల్ ఆఫీసర్ సుబ్బారెడ్డి, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడి శివ కుమార్, సర్వే ఇన్ స్పెక్టర్లు జయరాజు, తాహసిల్దార్ డి.సీతారామయ్య, సర్వే ఆఫ్ ఇండియా బృందం నాయకుడు ఆలీ, సర్వేయర్లు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.