ఎర్ర జెండా నీడలో ఎన్నో త్యాగాలు ఎన్నో విజయాలు… సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ
ఒంగోలు టౌన్ డిసెంబర్ 26 న్యూస్ మేట్ : ఎర్ర జెండా నీడలో ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో విజయాలు సాధించ బడ్డాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ అన్నారు. సిపిఐ 96వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులో అనేక ప్రాంతాల్లో సిపిఐ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్రం నేటి పాలకుల రాజకీయాలకు సమాధి అవుతుందని అన్నారు. స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం పాల్గొనని నాయకులు తామే స్వతంత్రం సాధించామని చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన అన్నారు. భారతదేశాన్ని నేడు పాలిస్తున్న నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మివేస్తూ భారతదేశంలో ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేస్తున్నారని ఆయన విమర్శించారు .తాము అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం అని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోడీ ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు అని ఆయన దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ పాలన పై రైతులు పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రారంభించారని ఆయన అన్నారు .ఢిల్లీలో ముప్పై నాలుగు రోజుల నుండి లక్షలాది మంది రైతులు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తుంటే వారి వైపు ప్రధానమంత్రి కన్నెత్తి చూడకపోవడం కుహనా పరిపాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జి ప్లస్ త్రీ గృహాలను ప్రజలకు పంపిణీ చేయకుండా రాజకీయం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేస్తున్న సెంటు స్థలం ప్రజలకు ఏమాత్రం సరిపోదని ఆయన తెలిపారు .కనీసం రెండు సెంట్లు పట్టణంలో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం ప్రజల పై ఆయనకున్న విశ్వాసం తేటతెల్లమవుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన పారదర్శకంగా లేదని జగన్మోహన్రెడ్డి పంపిణీ చేస్తున్న ఇళ్ల ప్లాట్లు కేవలం వైఎస్ఆర్ పార్టీ వర్గానికి మాత్రమే చెందుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మస్తాన్ సిపిఐ నగర కార్యదర్శి ఎస్డి సర్దార్ నగర సహాయ కార్యదర్శి బి చంద్రశేఖర్ ఏఐటీయూసీ నాయకులు సుబాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.