మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన డి పి ఆర్ ఓ నారాయణ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఒంగోలు టౌన్ జనవరి 13 న్యూస్ మేట్ : మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రకాశం జిల్లా డి పి ఆర్ ఓ నారాయణరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సృజన్ మాదిగ బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. డిపిఆర్ఓ నారాయణరెడ్డి ఆఫీసులో పని చేస్తున్న మహిళ ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి కలంకం తెస్తున్న ఆయనను వెంటనే విధుల నుండి తొలగించాలని కోరారు. ఆఫీసులో మహిళలను వేధింపులకు గురి చేస్తున్న నారాయణ రెడ్డి మంత్రి అండదండలు తనకు ఉన్నాయన్న అహంభావంతో దళితులైన మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ఆయన అహంకారానికి నిదర్శనం అని సృజన్ మాదిగ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకట స్వామి ఎం ఎస్ పి ఎస్ నాయకులు కన్నా మాదిగ చాట్ల మహేష్ మాదిగ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.