నాలుగింతలు పెంచేస్తారా?

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేవారికి రెడ్‌ కార్పెట్‌ వేస్తాం. మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేసిన స్థలాలిస్తాం’’ అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. మరోవైపు ఏపీఐఐసీ మాత్రం పారిశ్రామిక వేత్తలను ముప్పతిప్పలు పెడుతోంది. వారికి కేటాయించిన స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తోంది. స్థలాల కోసం నాలుగేళ్ల క్రితమే డబ్బు చెల్లించినా… మౌలిక సదుపాయాల కల్పన పేరిట సొమ్ము అదనంగా చెల్లించాలని నోటీసులు ఇస్తోంది. లేకుంటే స్థలాల కేటాయింపును రద్దు చేస్తామంటోంది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కృష్ణాజిల్లా మల్లవల్లి బహుళ ఉత్పత్తుల సెజ్‌లో స్థలాల రిజిస్ట్రేషన్‌ కోసం అదనంగా చెల్లించాలంటూ ఏపీఐఐసీ కోరడంపై పలువురు పారిశ్రామిక వేత్తలు మండిపడుతున్నారు. అక్కడ పరిశ్రమలు పెట్టాలంటూ ఏపీఐఐసీ అధికారులే తమను కోరారని, పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమై భూమి కొనుగోలు చేస్తే ఇప్పుడు నిర్ణయించిన ధర కంటే నాలుగింతలు ఎక్కువ కట్టమనడమేంటని నిలదీశారు. మల్లవల్లి సెజ్‌లో 2017లో స్థలాలు తీసుకున్న వారితో ఏపీఐఐసీ అధికారులు గురువారం సమావేశమయ్యారు. మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా ఖర్చయిందని, ధర పెంచాల్సి వస్తోందని చెప్పడంపై పారిశ్రామిక వేత్తలు స్పందిస్తూ 20, 30మందిని కాకుండా పార్కులో స్థలాలు పొందిన 600 మందినీ దీనిపై అభిప్రాయం అడగాలని సూచించారు. ఏపీఐఐసీ నిర్ణయించిన భూమి ధర ఎప్పుడో కట్టేశామని, ఇప్పుడు అదనంగా పెంచడమేంటని అడిగినట్లు తెలిసింది. 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం మల్లవల్లిలో సుమారు 1,400 ఎకరాల్లో ఏర్పాటుచేసిన సెజ్‌లో ఎకరా రూ.16.5లక్షలు చొప్పున పారిశ్రామిక వేత్తలకు కేటాయించింది. అందులో రూ.7లక్షలు భూమి ధర కాగా, మిగతాది మౌలిక సదుపాయాల కల్పనకు అని వర్గీకరించారు. అయితే ఆ రూ.9.5లక్షలు ఇప్పుడు ఏకంగా నాలుగింతలై రూ.38లక్షలు అయిందని ఏపీఐఐసీ అంతర్గతంగా చెబుతోందని సమాచారం. అప్పట్లో రూ.16.5 లక్షలు చెల్లించినవారు ఇప్పుడు రిజిస్ర్టేషన్‌ చేయాలని కోరితే మళ్లీ నాలుగింతలు కట్టాలనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు ఎక్కువైందని, అందుకే అదనంగా చెల్లించాలనడంతో పెరిగిన ఖర్చులు, పెంచేసిన అంచనాల లోగుట్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మల్లవల్లి సెజ్‌లో ఏపీఐఐసీ ఏర్పాటుచేసే మౌలిక సదుపాయాల్లో రోడ్లు, నీళ్లు, విద్యుత్‌, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటే ప్రధానం. అంతర్గత రోడ్లకు ఎకరాకు రూ.4లక్షలు, వరద నీటి డ్రైనేజీకి ఎకరాకు రూ.3లక్షలు, అంతర్గత విద్యుత్‌ సరఫరాకు ఎకరాకు రూ.లక్ష, అంతర్గత నీటి సరఫరాకు రూ.లక్ష ఖర్చవుతుందని అంచనా వేశారు. అసైన్డ్‌ రైతులకు చెల్లించిన ధరను కూడా కలిపి రూ.16.5 లక్షలుగా నిర్ణయించారు.

ఏపీఐఐసీ ఆ మొత్తం కట్టించుకొని పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయించింది. ఇదంతా 2017-18 నాటికి పూర్తయిన ప్రక్రియ. ఆ తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభించారు. అక్కడ స్థలాలు పొందిన కంపెనీలు తమకు వాటిని రిజిస్ర్టేషన్‌ చేయాలని కోరాయి. అయితే మౌలిక సదుపాయాల ఏర్పాటు ఖర్చు పెరిగిపోయిందని, కాబట్టి అదనంగా చెల్లించాలని ఏపీఐఐసీ కోరింది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ధర నిర్ణయించి, డబ్బులు కూడా కట్టేశాక ఇప్పుడు అంత భారీగా మళ్లీ చెల్లించాలని అనడమేంటని పరిశ్రమల యజమానులు మండిపడుతున్నారు. ఈ పార్కులో పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన స్థలాలు చదును చేసే అంశం కూడా మౌలిక సదుపాయాల్లో ఉంది. ఇప్పటి వరకూ అక్కడ తట్ట మట్టి కూడా వేయలేదు. ఆ స్థలాలను ఎవరికి వారు అభివృద్ధి చేసుకోవాల్సిందే. కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్‌ కనెక్షన్ల ఏర్పాటుకు అంత ఖర్చు ఎందుకవుతుందని యజమానులు ప్రశ్నిస్తున్నారు. మల్లవల్లి పార్కులో కేటాయించిన కొన్ని స్థలాలు 30 అడుగుల లోతున ఉన్నాయి. పైగా అక్కడికి వెళ్లేందుకు దారి కూడా లేదు. 18వ బ్లాక్‌లో కేటాయించిన వందలాది స్థలాలకు వెళ్లేందుకు రోడ్డు కూడా లేదు. రోడ్డు వేసేందుకు అక్కడి రైతుల అభ్యంతరాలున్నాయి. కాగా, ఈ సెజ్‌లో దాదాపు వందమందికి వివాదాల్లో ఉన్న స్థలాలను ఏపీఐఐసీ కేటాయించింది. తమకు న్యాయం చేయాలని మూడేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మల్లవల్లి పారిశ్రామిక పార్కులోని స్థలాల్లో 16శాతం ఎస్సీలకు, 7శాతం ఎస్టీలకు, బడుగు, బలహీనవర్గాల వారికి 50 శాతం వరకూ కేటాయించారు. ఇప్పుడు వారంతా ఏపీఐఐసీ వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అప్పట్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అందరికీ ఏపీఐఐసీ నిర్ణయించిన ఎకరం రూ.16.5లక్షల ధరలో సగం రేటుకే స్థలం ఇచ్చారు. పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న చిన్న, మధ్యతరగతి వారు పలువురు ఈ స్థలాలను తీసుకున్నారు. ఇప్పుడు అదనంగా డబ్బులు చెల్లించాలనడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా ఏపీఐఐసీ తీరు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *