రూ.10కే వైద్యం..

మంగళగిరి, న్యూస్‌మేట్ (ఏఫ్రిల్ 4): దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌. కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల్లోని ముఖ్యమైన వ్యక్తులకు సుస్తీ చేస్తే తొలుత గుర్తొచ్చేది ఎయిమ్సే. అటువంటి ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌.. రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా విజయవాడ-గుంటూరుకు మధ్యలోని మంగళగిరిలో ఏర్పాటైంది. తొలుత ఔట్‌ పేషంట్‌ సేవలతో ప్రారంభించి.. ఇప్పుడు ఇన్‌పేషంటు సేవలు కూడా అందిస్తోంది. ప్రముఖ వైద్యులు, వైద్య విద్యార్థులు.. ఆధునిక వైద్య పరికరాలతో ఇక్కడ ఉన్నతమైన సేవలు అందిస్తున్నారు. పేదలకు కూడా అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలతో.. ఖరీదైన వైద్య సేవలు… వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎయిమ్స్‌.. వివిధ విభాగాల్లో వైద్యసేవలను విస్తరించుకుంటూ సగటున రోజుకు 500 మందికిపైగా రోగులకు సేవలు అందిస్తోంది. సోమవారమైతే ఈ సంఖ్య 750 దాటిపోతుంది.

రెండు విధాలుగా వైద్య సేవలు:

మంగళగిరి ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రస్తుతానికి రెండు విధాలుగా అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రికి నేరుగా వచ్చి పది రూపాయల కన్సల్టేషన్‌ ఫీజుతో వైద్యులను కలిసి సేవలు పొందవచ్చు. ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకుని టోకెన్‌ తీసుకున్న రోగులు సాయంకాలం నాలుగు గంటల వరకు వైద్య సేవలను పొందవచ్చు. వారంలో ఒక్క శనివారం మాత్రం ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉదయం 12గంటల వరకే ఉంటుంది. ఆదివారం సెలవు. ఇక రెండో రకం సేవల కింద టెలిమెడిసన్‌ విధానం అందుబాటులో ఉంది.

ఈ విధానంలో రోగులు 85230 07940 లేదా 94930 65718 నంబర్లకు ఉదయం 8:30 నుంచి 11 గంటల మధ్య ఫోన్‌చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వీరికి ఉదయం 11 గంటల నుంచి వైద్యులే ఫోన్‌చేసి వైద్య సలహాలు అందిస్తారు. ఇది పూర్తిగా ఉచితం.

అందుబాటులో ఎన్నో వైద్య సేవలు :

మంగళగిరి ఎయిమ్స్‌లో పలు రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీఎ్‌ఫఎం (కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌), ఈఎన్‌టీ, ఫిజికల్‌ మెడిసన్‌ అండ్‌ రీహబిటేషన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్ధోపెడిక్స్‌, సైక్రియాట్రి, ఆఫ్తమాలజీ, డెర్మటాలజీ, పెడియాట్రిక్స్‌, ఓబీజీ, డెంటిస్ట్రీ వంటి విభాగాలలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నారు. రేడియాలజీ విభాగంలో అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనస్థీయాలజీ కూడా అందుబాటులో ఉంది. ప్రత్యేకించి హిమోఫిలియా వ్యాధిగ్రస్తుల కోసం ట్రాన్స్‌ప్యూషన్‌ మెడిసన్‌ను అందుబాటులోకి తెచ్చారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చే నెల నుంచి కొన్ని రకాల సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

50 పడకలతో ఇన్‌పేషెంట్‌ విభాగం :

మంగళగిరి ఎయిమ్స్‌లో 50 పడకలతో ఇన్‌పేషెంట్‌ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో ప్రధానమైన ఓపీడీ బ్లాకు వెనుకవైపు ఉన్న ఆయుష్‌ భవనాన్ని ఇన్‌పేషెంట్‌ వార్డుగా వినియోగిస్తున్నారు. ఇక్కడ అడ్మిషన్‌ చార్జీ రూ.25 కాగా, ఒక్కో పడకకు రోజుకు రూ.30 చార్జిగా నిర్ణయించారు. ఇవిగాక నర్సింగ్‌ చార్జీలు, ఇతర ఫీజులేమీ ఉండవు. వైద్య పరీక్షలు, మందులకు అతి తక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రోగులకు అవసరమైన మందుల కోసం అమృత్‌ ఫార్మసీ అందుబాటులో ఉంది.

ఎలా చేరుకోవాలంటే….

మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రిని పాత టీబీ శానిటోరియం ప్రాంగణంలో మంగళగిరి కొండల నడుమ పాత, కొత్త హైవేల మధ్య నిర్మించారు. ప్రస్తుతానికి కొత్త హైవే నుంచి నిర్మిస్తున్న రహదారి మార్గం ఇంకా పూర్తికాలేదు. దీంతో మంగళగిరి పట్టణం వైపు ఉన్న పాత రహదారే ప్రధాన మార్గంగా ఉంది. ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఆటోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బస్టాండ్‌ నుంచి ఎయిమ్స్‌లోకి రూ.20-50 చార్జీలు వసూలు చేస్తున్నారు. కొత్త హైవే నుంచి ఎయిమ్స్‌లోకి నిర్మిస్తున్న రహదారి పూర్తయితే రోగులు ఆసుపత్రికి సులభంగా చేరుకోవచ్చు.

మహిళల కోసం ప్రత్యేక విభాగం

మంగళగిరి ఎయిమ్స్‌లో మహిళల కోసం ప్రత్యేక స్ర్కీనింగ్‌ విభాగం ఏర్పాటు చేశారు. కేన్సర్‌ విస్తృతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి బుధవారం మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య బ్రెస్ట్‌ కేన్సర్‌ నిర్ధారణ కోసం ప్రత్యేక స్ర్కీనింగ్‌ పరీక్షలను పది రూపాయల ఫీజుతో నిర్వహిస్తున్నారు. మామోగ్రఫీ అవసరమైనవారికి తక్కువ ఫీజుతో సంబంధిత పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏవైనా ఎయిమ్స్‌లోని వైద్యులు సూచించిన మీదటే చేస్తారు.

వైద్య పరీక్షల ఫీజులు ఇలా.. (రూపాయల్లో)

కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ 135

ఫాస్టింగ్‌ అండ్‌

ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ 24+24

లివర్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ 225

కిడ్నీ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ 225

లిపిడ్‌ ప్రొఫైల్‌ 200

థైరాయిడ్‌ ప్రొఫైల్‌ 200

ఈసీజీ 50

ఛాతి ఎక్స్‌రే 60

మామోగ్రఫీ 630

అలా్ట్రసోనోగ్రఫీ 323

యూరిన్‌ ఎనాలిసిస్‌ 35

హెచ్‌ఐవీ రాపిడ్‌ టెస్ట్‌ 150

హెచ్‌బియస్‌ ఏజీ

రాపిడ్‌ టెస్ట్‌ 28

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *