నేడే పోలింగ్!‌

రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ మంగళవారం స్టే ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్నం వరకు సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లాలని సిబ్బందికి ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న సందేహాలతోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ బూత్‌లకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం డివిజన్‌ బెంచ్‌ సదరు స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో పరిషత్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు గత ఏడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. అదే నెల 14న రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించారు. కొవిడ్‌ ఉధృతి కారణంగా అదే నెల 15న నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన మాజీ సీఎస్‌ నీలం సాహ్ని ఈ నెల ఒకటో తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి ప్రారంభిస్తూ.. 8న పోలింగ్‌, 10న కౌంటింగ్‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీచేశారు. 4 వారాల కోడ్‌ను అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదంటూ టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్నికలు నిలుపుదల చేస్తూ 6న సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలిచ్చింది. డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఆ స్టేను ఎత్తివేసింది. దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు గురువారం పోలింగ్‌ జరుగనుంది.

13 జిల్లాల్లో 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు.. పోటీలో ఉన్న వివిధ పార్టీల తరఫు అభ్యర్థులు 11 మంది మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు. అదే విధంగా 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. 375 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సగం సమస్యాత్మకం..

పరిషత్‌ ఎన్నికల కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 6,942 సమస్యాత్మకమైనవి కాగా.. 6,314 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవి. 247 పోలింగ్‌ కేంద్రాలను నక్సల్స్‌ ప్రభావిత కేంద్రాలుగా గుర్తించారు. 43,830 పెద్దవి, 12,898 మధ్యరకం, 46,502 చిన్న బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. 652 మందిని రిటర్నింగ్‌ అధికారులుగా, 1091 మందిని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా, 36,614 మంది ప్రిసైడింగ్‌ అధికారులుగా నియమించారు. 1,34,430 మంది పోలింగ్‌ సిబ్బందిని కూడా నియమించారు. దీంతో పాటు జోనల్‌ అధికారులుగా 1,972 మంది, పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు 6,524 మంది మైక్రో అబ్జర్వర్లు నియమితులయ్యారు. 587 పంపిణీ కేంద్రాల ద్వారా అన్ని పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ సామగ్రిని తరలించారు.

మాస్కులు, శానిటైజర్లు..

కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ గ్లోవ్స్‌లను అవసరమైన సంఖ్యలో పోలింగ్‌ స్టేషన్ల వారీగా సిద్ధం చేశారు. ఎవరైనా కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులు ఉంటే.. వారికి అవసరమైన పీపీఈ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. వారు పోలింగ్‌ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. సిబ్బంది అందరికీ కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన రక్షణ చర్యలు, మహిళా సిబ్బందికి తగిన వసతులను ఏర్పాటు చేశారు. పంపిణీ కేంద్రాల్లో, పోలింగ్‌ స్టేషన్లలో అల్పాహార, భోజన వసతి ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు. పోలింగ్‌ సమయంలో అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకు పోలీసు సహకారంతో తగు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్‌ కోసం 3,538 మందిని నియమించారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాల్లో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న 13 మంది అధికారులను జిల్లాకొక రు చొప్పున ఇన్‌చార్జులుగా నియమించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే కాల్‌ సెంటర్‌కు టోల్‌ఫ్రీ నంబర్‌ 0866 2466877కు కాల్‌ చేయాలని అధికారులు తెలిపారు.

పోలింగ్‌కు పటిష్ఠ బందోబస్తు

పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌కు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ఇప్పటికే గుర్తించిన హింసాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ప్రతి సబ్‌ డివిజన్‌లో ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను అప్రమత్తంగా ఉంచారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ బుధవారం జిల్లాల ఎస్పీలతో బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్‌ను అనుమతిస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే హుటాహుటిన వాహనాల్లో పోలీసు సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు పంపారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా.. ఎన్నికలు అధికార పక్షం ఊహించినంత ఏకపక్షంగా జరగడంలేదు. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలను ఆదేశించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *