నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ ఇక లేరు..

(Ashwaq Ahmed, Cultural Correspondent)

ముంబయి(Newsmate, Friday, July 3, 2020): దేశంలో ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా ప్రసిద్ధికెక్కిన నృత్యదర్శకురాలు, మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న సరోజ్‌ ఖాన్‌(71) ఇక లేరు. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరిన సరోజ్ ఖాన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయమే సరోజ్‌ఖాన్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు.  1974లో ‘గీతా మేరా నామ్‌’ చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె ‘మిస్టర్‌ ఇండియా’, నాగినా, చాంద్‌నీ వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు నృత్యదర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌కు పేరు తెచ్చిన ‘తేజాబ్‌’ చిత్రంలోని ‘ఏక్‌.. దో.. తీన్‌’ పాటకు సరోజ్‌ ఖానే కొరియోగ్రఫీ చేశారు.  హిందీలో వచ్చిన దేవదాస్‌ చిత్రంలోని ‘డోలా రే డోలా’ పాటకు 2003లో, శృంగారం సినిమాలోని అన్ని పాటలకు 2006లో, ‘జబ్‌ వి మెట్‌’లోని ‘యే ఇష్క్‌ హాయే’ గీతానికి 2008లో.. వైవిధ్యభరితంగా నృత్యాలు సమకూర్చినందుకుగానూ జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ చిత్రానికిగాను ఆమె 1998లో నంది అవార్డు కూడా అందుకున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *