బాల్య వివాహాలు అరికడదాం బాల్యాన్ని కాపాడుదాం
కనిగిరి అక్టోబరు 7 (న్యూస్ మేట్) : బాల్యవివాహాలను నివారించాలంటే ముందుగా ప్రజల్లో అవగాహన ఏర్పడేలా చైతన్యం తేవాలని కె యస్ యమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు. బుధవారం రెండవ సచివాలయం పరిధిలో బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 ,వివాహం తప్పనిసరి నమోదు చట్టం2002 పై నగర పంచాయతీ సహకారంతో న్యాయ సేవాధికార సంస్థ మరియు గుడ్ హెల్ప్ సంస్థ ఆద్వర్యంలో మహిళ సంరక్షణ కార్యదర్సి సురభి వాసంతి అద్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బాల్యవివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే 100,1089 కాల్ చేయాలి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయిని తెలిపారు. బాల్యవివాహాల నిషేధ చట్టం అమలు విషయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. చట్టం అమలు విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బాల్యవివాహాలు పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అందరి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు.చట్టంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఐ సి డి యస్ ప్రోజెక్ట్ అసిస్టేంట్ గంధం శామ్యూల్ మాట్లాడుతూ చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల తలెత్తే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని , బాల్య వివాహ నిషేధ చట్టం-2006 అమలుతీరు, అతిక్రమించే వారికి ఉండే శిక్షలు, బాల్యవివాహాలపై ఫిర్యాదు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.పార లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ వివాహ నమోదు చట్టం-2002 ప్రకారం ప్రతీ పెళ్ళి నమోదు చేయాలని అన్నారు. వివాహం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, సచివాలయం లో నమోదు చేయాలని, పెళ్ళికి చట్టబద్ధత రావడం వల్ల మోసాలు జరగకుండా, బార్య-భర్తలు ఎవరైనా రెండవ వివాహంను అడ్డుకునేందుకు భరణం కోరేందుకు పని చేస్తుందని, సైనిక, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి, విదేశాలకు వెళ్ళే వారికి వారి కుటుంబసభ్యులను గుర్తించడానికి ఈ దృవీకరణ పత్రం ఉపయోగ పడుతుందని తెలిపారు.కార్యక్రమంలో వి.ఆర్.ఎ ఏడుకొండలు సచివాలయం శానిటర్ కార్యదర్శి రమణ రెడ్డి ,వార్డు వాలంటీర్లు,మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.