వరి విత్తనాల కోసం పరుగులు తీస్తున్న రైతులు
లింగసముద్రం అక్టోబర్ 12 (న్యూస్ మేట్) : రాళ్లపాడు ఆయకట్టుకు ఈనెల 18న నీళ్లు విడుదల చేయనుండటంతో రాళ్లపాడు కుడి ఎడమ కాలువల ఆయకట్టు పరిధిలోని రైతులు వరి విత్తనాల కోసం పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం రాళ్లపాడు ప్రాజెక్టులో 16.7 అడుగుల నీరు ఉంది. సోమశిల నుండి నీరు వస్తుండడంతో రైతులకు నీరు సరి పోవచ్చని రైతులు వరి నాట్లు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి కూడా హామీ ఇవ్వడంతో వరి నారుమడి లో సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. మండలంలోని అన్ని బోయినపల్లి చీమలపెంట జంపాల వారి పాలెం అంగిరేకుల పాడు గ్రామంలోని రైతులు నెల్లూర్ సన్నాలు, 1010 రకం వరి నాటేందుకు కావలసిన విత్తనాలను కావలి వెళ్లి తెచ్చుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండే అవకాశం ఉండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.